Single Blog Title

This is a single blog caption
23
Aug

మద్యం ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధించుకునే అధికారంగ్రామపంచాయితీలకు ఇవ్వాలి.

తెలంగాణ గ్రామ పంచాయతీ చట్టం – 2018 లో ఈ మేరకు మార్పులు చేయాలి.

కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక,ఫోన్: 09912928422

మనుషులు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు?

మనిషి ఆరోగ్యంగా ఎదగడానికి విషపూరితం గాని పౌష్టిక, వైవిధ్యమైన ఆహారం, కలుషితం కాని మంచినీరు, పరిశుభ్రమైన పరిసరాలు, శాస్త్రీయ దృక్పథంతో ప్రకృతిని అర్థం చేసుకునే జ్ఞానం, సమస్యలను ఉమ్మడిగా పరిష్కరించుకునే పరస్పర సహకార వ్యవస్థ, వీటిని బలోపేతం చేసే విధంగా ఉండేి ప్రభుత్వ విధానాలు, కొన్ని స్పష్టమైన చట్టాలు, మార్గదర్శకాలు, అమలుకు కావలసిన నిధులు, మానవ వనరులు- ఇవన్నీ ఉంటే మాత్రమే మనుషులు ఆరోగ్యంగా జీవించగలుగుతారు.

ఇది జరగాలంటే రసాయన ఎరువులు, పురుగు విషాలు లేని సేంద్రియ వ్యవసాయం రాష్ట్రమంతా జరగాల్సి ఉంటుంది. ప్రజలందరూ కేవలం బియ్యం వినియోగించే ఆహార అలవాట్ల నుంచి, ఇతర పౌష్టిక, వైవిధ్యభరిత ఆహార అలవాట్లను పెంచుకోవాల్సి ఉంటుంది. పరిశుభ్రమైన తాగునీరు అందరికీ అందవలసి ఉంటుంది. మద్యం, సిగరెట్లు, బీడీ, తంబాకు, గుట్కా, కల్తీ కల్లు, గంజాయి , ఇతర మాదక ద్రవ్యాలు ప్రజలకు అందుబాటులో లేక పోవడం, ప్రజలు వాటి వినియోగానికి దూరంగా ఉండటం జరగాలి.ఇందుకోసం ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, పౌర సమాజం, ప్రజలు- ఉమ్మడిగా పనిచేయాల్సి ఉంటుంది.

ఇవన్నీ విన్న వెంటనే మనకు ఇది ఆచరణ సాధ్యం కాదు అనిపిస్తుంది.

దానికి కారణాలు అనేకం.పేదరికం , నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు , ప్రజల సాంస్కృతిక జీవనం, బలహీనంగా ఉన్న స్థానిక పరిపాలనా వ్యవస్థలు , మద్యం ఆదాయం పై ఆధార పడుతున్న ప్రభుత్వ బడ్జెట్ లు, దీర్ఘకాలంగా ప్రజల్లో ఉన్న మద్యం అలవాట్లు , మద్యం కంపెనీలు, కల్తీకల్లు ఉత్పత్తి, మార్కెటింగ్ పై ఆధారపడి ఉన్న మాఫియా, కుటుంబాలు, అన్నిటికీ మించి మద్యనిషేధం సాధించి , అమలు చేయించుకోవడం సాధ్యం కాదని ముందే చేతులు ఎత్తేసిన సామాజిక , రాజకీయ శ్రేణులు.

మిగిలిన అన్ని విషయాల గురించి విడివిడిగా, లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.కానీ ఈ సారి, ఒక గ్రామీణ కార్యకర్త గా మద్యంపై కొన్ని ప్రతిపాదనలను నేను చర్చకు పెడుతున్నాను.

వ్యవసాయ రంగంలో పురుగు విషాలు, రసాయనిక ఎరువులు కలుపు విషాలు ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తు న్నాయో, సామాజిక, రాజకీయ రంగాలలో మద్యం అంతే విధ్వంసాన్ని సృష్టిస్తున్నది.

మద్యం కుటుంబాలను ఆర్థికంగా దివాళా తీయించడమే కాదు, కుటుంబాల్లో హింసను పెంచుతున్నది. వ్యక్తులను మృత్యు ముఖం వైపు నడిపిస్తు న్నది.రోడ్డు ప్రమాదాలకు, స్త్రీలపై అత్యాచారాలకు కారణమవుతున్నది.

అన్నిటినీ మించి మనిషి ఆలోచనాశక్తిని, విచక్షణా జ్ఞానాన్ని చంపేస్తున్నది .సమిష్టి తత్వాన్ని, ప్రజాస్వామిక విలువలను దెబ్బతీస్తున్నది .కాబట్టి ప్రస్తుతం కొనసాగుతున్నది మద్యం ఆధారిత సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ మాత్రమే. అమలులో ఉన్నది అనాగరిక విలువలు మాత్రమే.

అందుకే, ఈ వ్యవస్థను సంపూర్ణంగా మార్చాలనుకుంటున్న వాళ్ళు ముందుగా మద్యం పై పని చేయాలి. అది అంతిమంగా మానవీయ విలువలతో ముందుకు సాగేలా అనేక ఉద్యమాలలోకి ప్రజలను సమీకరిస్తుంది.

సాధారణ ప్రజలను, ఆయా కుటుంబాలను దెబ్బతీస్తున్న మద్యం మహమ్మారి వివిధ రూపాలను మనం ఇప్పటికే గమనిస్తున్నాం.రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ల పరంగా నేను కొన్ని గణాంకాలను మీ ముందు ఉంచుతున్నాను.

2014 జూన్ లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి 2020- 21 లో బడ్జెట్లో ఎక్సైజ్ ఆదాయ అంచనాల వరకు ప్రభుత్వాలు మద్యం అమ్మకాలపై ఎంతగా ఆధారపడి ఉన్నాయో స్పష్టంగా తెలుస్తున్నది.

మద్యం మీద ప్రధాన ఖర్చు మగవాళ్ళదే అయినా, ఆదాయం మాత్రం ఐదుగురు పొందుతున్నారు.ప్రభుత్వానికి పన్నుల రూపంలో, వ్యాపారులకు, కంపెనీలకు లాభాల రూపంలో, పోలీసులకు జరిమానా/ లంచాల రూపంలో, పార్టీలకు విరాళాల రూపంలో, డాక్టర్లకు ఫీజుల రూపంలో. అందుకే మద్యంపై నిషేధానికి ఎవరూ సుముఖంగా లేరు.

2014 – 15 లో తెలంగాణ ప్రభుత్వానికి మద్యంపై పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం 2823 కోట్ల 54 లక్షలు.2015- 16 లో అది 3809కోట్ల 7 లక్షలు.2016 – 17 లో 5580 కోట్ల 71 లక్షలు.2017 – 18 నాటికి ఇది 9421 కోట్ల 53 లక్షలకు పెరిగింది.

2018 – 19 లో 10637 కోట్ల యాభై ఆరు లక్షలు ఉంటే, 2019 – 20 జనవరి నాటికి అది 12600 కోట్లకు పెరిగింది.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 20 – 21 బడ్జెట్లో ఎక్సైజ్ పన్ను ఆదాయాన్ని 16000 కోట్లు గా అంచనా వేస్తున్నది.

అంటే గత ఐదు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం పై వస్తున్న ఆదాయం ఏడు రెట్లు పెరిగింది అన్నమాట.

అంత ఆదాయం ప్రభుత్వానికి రావాలంటే మద్యం అమ్మకాలు భారీగా పెరగాలి. లేదా మద్యం ధరలు భారీగా పెరిగాలి.. ఏది జరిగినా సమాజము, కుటుంబాలు మరింత విధ్వంసానికి గురవుతాయి అన్నది వాస్తవం.ఆ విధ్వంసాన్ని మనం అనుమతించ నవసరం లేదు.

మద్యం విషయంలో ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా కొన్ని ప్రయోగాలు చేస్తున్నాయి. వాటిని లోతుగా మనం అధ్యయనం చేయాలి.

  1. బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం మద్యంపై నిషేధం విధించి అమలు చేస్తున్నది. అమలు విషయంలో కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ , అనేక సానుకూల ఫలితాలు కూడా ఉన్నట్లు కథనాలు వచ్చాయి.

2.కేరళలో యుడిఎఫ్ ప్రభుత్వం మద్య నిషేధం విధించగా, ఎల్డీఎఫ్ ప్రభుత్వం 2017 నుండి దానిని కొంత సడలించింది. టూరిజం పై ప్రభావం, ఆదాయం తగ్గి పోవడం దీనికి ప్రధాన కారణాలుగా చెప్పింది.

3. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా తానే మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నది. మద్యం అమ్మకాలపై కొన్ని నియంత్రణలు విధించింది. బెల్టుషాపులను రద్దు చేసింది. క్రమంగా మద్య నిషేధం వైపు వెళ్తామని ప్రకటించింది.

4. గుజరాత్లో 1960 నుండి మధ్య నిషేధం అమలులో ఉన్నప్పటికీ అది సరిగా అమలు కావడం లేదని, ఆ రాష్ట్రంలో మద్యం విస్తృతంగా దొరుకుతుందని కథనాలు ఉన్నాయి.

5.నాగాలాండ్ రాష్ట్రంలో 19 89 నుండి మద్య నిషేధం అమలులో ఉంది.
6.కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న లక్షద్వీప్ లోనూ (ఒక్క బంగారం ద్వీపంలో తప్ప) మద్య నిషేధం అమలులో ఉంది.

  1. మణిపూర్ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో పాక్షికం నిషేధం అమలులో ఉంది.
  2. మిగిలిన అన్ని రాష్ట్రాలలో మద్యపానానికి వయో పరిమితి విధించారు. కొన్నిచోట్ల కొన్ని మద్యాల వినియోగానికి వయో పరిమితి విధించారు.
  3. కర్ణాటకలో 2007 జూలై 1 నుండి కల్లుపై నిషేధం ఉంది.

ఎన్ని నియంత్రణలు, ఎంత నిషేధం ఉన్నా గత 20 సంవత్సరాల కాలంలో మద్యం వినియోగం 72.5 శాతం పెరిగిందని OECD నివేదిక చెప్పింది.

షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీరాజ్ వ్యవస్థ విస్తరణ (PESA) చట్టం ఆదివాసి గ్రామ సభలకు తమ గ్రామాలలో మద్యం ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధించుకునే హక్కును కల్పించింది.

హర్యానా రాష్ట్రం 2020 ఏప్రిల్ 1 నుండి గ్రామ పంచాయతీలకు మద్యం నిషే ధించుకునే అధికారాన్ని కల్పిస్తూ తెచ్చిన చట్టాన్ని అమలు చేయనుంది. గ్రామ సభలో 10 శాతం మంది మద్యం అమ్మకాలను వ్యతిరేకిస్తే ఆ గ్రామ పంచాయితీ తమ గ్రామంలో మద్యం అమ్మబోమని ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపుతుంది. ఆ తీర్మానాన్ని ప్రభుత్వం ఆమోదిస్తుంది.

ఇప్పటికే 872 గ్రామసభలు, 850 గ్రామ పంచాయతీలు ఆ మేరకు తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాయి. రాష్ట్రంలోని మొత్తం గ్రామ పంచాయతీలలో ఇవి 13%.

మహారాష్ట్ర ఎక్సైజ్ చట్టం కూడా మద్యం ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధించుకునే హక్కు జిల్లా ప్రభుత్వానికి ఇచ్చింది. ఫలితంగా వార్ధా, గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాలో మద్యం ఉత్పత్తి, నియామకాలను నిషేధించారు.
మణిపూర్ లో కూడా 2002 నుండి పాక్షిక నిషేధం ఉంది. బిష్ణు పూర్, తూర్పు ఇంపాల్, పశ్చిమ ఇంపాల్, తౌబాల్ జిల్లాల్లో మద్యం పై నిషేధించారు.మిజోరంలో 2019 నుండి మద్య నిషేధం విధించారు.

భారత రాజ్యాంగం 7వ షెడ్యూల్ ప్రకారం మద్యం పై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది. ఇందులో కేంద్రం జోక్యం చేసుకోదు.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మద్యనిషేధం సాధించడం కోసం ప్రజల పక్షాన పనిచేసే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర వేదికలు ఉమ్మడిగా పోరాడాలి. బెల్ట్ షాపుల రద్దు తో ప్రారంభించి, పూర్తి నిషేధం వైపు ఈ ప్రయాణం సాగాలి.

మద్యాన్ని నిషేధించే అధికారం గ్రామ పంచాయతీలకు ఇస్తూ చట్ట సవరణ చేయడంతోపాటు రాష్ట్రస్థాయిలో సంపూర్ణ మద్య నిషేధం విధించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.

కరోనా వైరస్ నేపథ్యంలో గతంలో అసంభవం అనుకున్నవన్నీ ఇప్పుడు సంభవం అవుతున్నాయి.

సామాజిక కలయికలను నివారించడం కోసం దేవాలయాలను, మసీదులను, చర్చిలను, గురుద్వారాలను కూడా మూసి వేస్తున్నారు.

జాతర లను, గుళ్ల దగ్గర వేడుకలను కూడా రద్దు చేస్తున్నారు.ప్రజల కదలికలపై ఎక్కడికక్కడ నియంత్రణ విధిస్తున్నారు.

వైరస్ భయం మనుషులకు క్రమశిక్షణ అందిస్తున్నది. ప్రభుత్వాల నిరంతర సమీక్ష, అధికార యంత్రాంగం నిరంతర కదలిక, మీడియా ప్రచారం, ప్రజలలో ఒక భరోసా కలిగిస్తున్నాయి. ప్రభుత్వం, ప్రజలు సామాజిక బాధ్యతతో కలిసి పనిచేస్తే ఏదీ అసంభవం కాదు అనే విషయాన్ని ప్రస్తుత స్థితి స్పష్టం చేస్తున్నది.

అవసరం అయినప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛకు కూడా పరిమితులు ఉంటాయని ప్రస్తుత పరిస్థితి నేర్పుతుంది.

కనిపించని వైరస్ ను కట్టడి చేయడానికి ఇంత ప్రయత్నం అవసరమైనప్పుడు, కనిపించే మద్యం మహమ్మారిని మట్టు పెట్టడానికి ఇంకా ఎంత నిబద్ధత, ప్రయత్నం అవసరమవుతాయి.

చేతి వేళ్ళ మీద లెక్క పెట్టగలిగినంత మంది మాత్రమే కరోనా వైరస్ కారణంగా తెలుగు రాష్ట్రాలలో ఇబ్బంది పడ్డారు.

కానీమద్యం కారణంగా లక్షలాది కుటుంబాలు రోజూ సంక్షోభంలో పడుతున్నాయి. వేలాది మంది మరణిస్తున్నారు. యువత నిర్వీర్యమవుతు న్నది. కుటుంబాలలో హింస పెరుగుతున్నది.

అందుకే మద్యం మన సంస్కృతిలో భాగం అనో, వ్యక్తిగత హక్కు అనో భావించే వాళ్ళు, అది తప్పుడు వాదన అనే విషయాన్ని గుర్తించాలి, అంగీకరించాలి. మద్యనిషేధం కోసం ఒక్క గొంతుతో మాట్లాడాలి .

గ్రామ పంచాయతీ స్థాయిలో ఎలా అమలు చేయవచ్చు..?

  1. గ్రామ పంచాయతీ చట్టం – 2018లో నిర్దిష్ట సవరణలు చేస్తూ గ్రామ పంచాయతీలు మద్యం ఉత్పత్తి, అమ్మకాలు నిషేధించుకునే అధికారం కల్పించాలి.
  2. గ్రామపంచాయతీ పరిధిలో 18 సంవత్సరాలు నిండిన ప్రజలందరినీ గ్రామ సభ గా పరిగణించాలి. గ్రామ సభ సమావేశం జరిపి మద్యంపై చర్చించుకుని తీర్మానం చేయాలి. గ్రామ సభకు హాజరైన వారిలో కనీసం పది శాతం మంది మద్యానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే దానిని ఆమోదించి తీర్మానం చేయాలి.
  3. గ్రామపంచాయతీ సర్పంచ్ అధ్యక్షతన మద్య నిషేధం అమలు కమిటీ ఉండాలి. గ్రామ మహిళా సంఘం అధ్యక్షులు కమిటీ కన్వీనర్ గా ఉండాలి. గ్రామంలో ఉండే మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా ఉద్యోగులు కమిటీలో సభ్యులుగా ఉండాలి.
  4. మద్యం ఉత్పత్తి చేసే వారికి, అమ్మే వారికి, తాగేవారికి జరిమానాలు / శిక్షలు విధించే అధికారం ఈ కమిటీ కి ఉంటుంది. ఎక్సైజ్ , పోలీస్, పంచాయతీ అధికారులు మద్యనిషేధం విషయంలో ఈ కమిటీదే తుది నిర్ణయం గా గుర్తించాలి. జరిమానాల మొత్తాన్ని గ్రామాభివృద్ధికి వినియోగించాలి.
  5. మద్యానికి బానిసైన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి, వైద్య సహాయం అందించడానికి తగిన ఏర్పాట్లను ఈ కమిటీ చేసి, పర్యవేక్షిస్తుంది.
  6. మద్యనిషేధం ప్రకటించుకున్న గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా 10 లక్షల రూపాయల ప్రత్యేక గ్రాంట్ అందించాలి.

ఇవి కేవలం నా ప్రతిపాదనలు మాత్రమే. ప్రజలు , ప్రజా సంఘాలు, పౌర సమాజం వీటిని సవరించి సమగ్ర పరచాల్సి ఉంది.

Leave a Reply

You are donating to : Rythu Swarajya Vedika

How much would you like to donate?
$10 $20 $30
Would you like to make regular donations? I would like to make donation(s)
How many times would you like this to recur? (including this payment) *
Name *
Last Name *
Email *
Phone
Address
Additional Note
paypalstripe
Loading...