తెలంగాణ లో పత్తి పంటకు బీమా – 2019 వానాకాలం అనుభవాలు

కన్నెగంటి రవి , ఫోన్ :9912928422
గతంలో నేను రాసిన ఒక వ్యాసంలో తెలంగాణ లో పత్తి పంటకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం ఉండడం ఎంత అవసరమో, యే యే సంధర్భాలలో రైతులకు బీమా పరిహారం అందే అవకాశం ఉందో రాశాను.
2019 లో ఒక నెలలో కురవాల్సిన సగటు వర్షపాతంలో వివిధ మండలాలలో తక్కువ వర్షపాతం కురవడం వల్ల బీమా నోటిఫికేషన్ ప్రకారం రైతులకు అందే పరిహారం ఎంతో చూద్దాం.

- జులై 16 నుండీ ఆగష్టు 15 లోపు 150 మిల్లీ మీటర్ల కంటే తక్కువ వర్ష పాతం నమోదు కావడం వల్ల 45 మండలాలలో పత్తికి బీమా చేయించుకున్న రైతులకు హెక్టారుకు 7000 రూపాయల పరిహారం అందనున్నది.
- యిదే పీరియడ్ లో 130 మిల్లీ మీటర్ల కంటే తక్కువ వర్ష పాతం నమోదు కావడం వల్ల 49 మండలాలలో బీమా చేయించుకున్న రైతులకు హెక్టారుకు 10000 రూపాయల పరిహారం అందనున్నది.
- ఇదే పీరియడ్ లో 110 మిల్లీ మీటర్ల కంటే తక్కువ వర్ష పాతం నమోదు కావడం వల్ల 244 మండలాల్లో బీమా చేయించుకున్న రైతులకు 12000 రూపాయల పరిహారం అందనున్నది.
- ఆగష్టు 16 నుండీ సెప్టెంబర్ 15 లోపు 120 మిల్లీ మీటర్ల కంటే తక్కువ వర్ష పాతం నమోదు కావడం వల్ల 64 మండలాలలో బీమా చేయించుకున్న రైతులకు హెక్టారుకు 3000 రూపాయల పరిహారం అందనున్నది .
- యిదే నెలలో 100 మిల్లీ మీటర్ల కంటే తక్కువ వర్ష పాతం నమోదు కావడం వల్ల 68 మండలాలలో బీమా చేయించుకున్న రైతులకు హెక్టారుకు 5000 రూపాయలు పరిహారం అందనున్నది.
- ఇదే నెలలో 80 మిల్లీ మీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల 346 మండలాలలో బీమా చేయించుకున్న రైతులకు హెక్టారుకు 7000 రూపాయల పరిహారం అందనున్నది .
- సెప్టెంబర్ 16 నుండీ అక్టోబర్ 31 వరకూ 200 మిల్లీ మీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల 80 మండలాలలో బీమా చేయించుకున్న రైతులకు హెక్టారుకు 4000 రూపాయలు పరిహారం అందనున్నది .
- ఇదే పీరియడ్ లో 150 మిల్లీ మీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల 27 మండలాలలో హెక్టారుకు 6000 రూపాయలు పరిహారం అందనున్నది .
- ఇధే పీరియడ్ లో 100 మిల్లీ మీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల 188 మండలాలలో బీమా చేయించుకున్న రైతులకు హెక్టారుకు 9000 రూపాయల పరిహారం అందనున్నది.
- రాష్ట్రం లో ఉన్న 584 మండలాలలో పత్తి పంట సాగయ్యే మండలాలలో ( హైదరాబాద్,మేడ్చల్ జిల్లాలు తప్ప ) – హెక్టారుకు 64 మండలాల రైతులకు 3000రూపాయలు, 80 మండలాల రైతులకు 4000 , 68 మండలాల రైతులకు 5000 , 27 మండలాల రైతులకు 6000, 391 మండలాల రైతులకు 7000,188 మండలాల రైతులకు 9000, 49 మండలాల రైతులకు 10,000, 244 మండలాల రైతులకు 12,000 బీమా పరిహారం పొందనున్నాయి ( ఒక మండలం రైతు ఈ మూడు నెలల్లో కూడా పరిహారం పొందే అవకాశం ఉంది)
- 2019 ఖరీఫ్ లో మొత్తంగా 2,73,890 మండి రైతులు మాత్రమే వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంలో నమోదు అయ్యారు. కానీ వాతావరణంలో మార్పుల వల్ల వర్షపాతం విపరీతంగా హెచ్చు తగ్గులకు గురై పంటలు దెబ్బ తింటున్నాయి. ఫలితంగా బీమా సౌకర్యం ఉంటే రైతులకు ప్రయోజనం అని గత సంవత్సర లెక్కలు తెలియ చేస్తున్నాయి .
- ప్రభుత్వాలు తమవాటా ప్రీమియం ఇంకా కంపెనీలకు చెల్లించనందువల్ల రైతులకు ఇప్పటివరకూ ఇంకా పరిహారం అందలేదు.
- ఇంకా- వరుసగా 3 రోజులలో భారీ వర్షపాతం , వరుసగా 15 నుండీ 27 రోజుల పాటు డ్రై స్పెల్ డేస్ ఆధారంగా, అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆధారంగా కూడా రైతులకు బీమా పరిహారం అందే అవకాశం ఉంది. ఆ డాటా ను కూడా విశ్లేషిస్తున్నాం.
- వాస్తవానికి ఈ వివరాలను బీమా ప్రీమియం కట్టిన రైతులందరికీ వ్యవసాయ శాఖ గానీ ,లేదా బీమా కంపెనీ గానీ తెలియ చేయాలి . కానీ ఎవరూ ఆ బాధ్యత తీసుకోవడం లేదు . దానివల్ల రైతులకు ఎప్పుడు పరిహారం అందుతుందో ,ఎంత అందుతుందో తెలియడం లేదు .
- ఈ సంవత్సరం బీమా పథకం అమలు చేయకపోవడం వల్ల ఇలాగే వర్షపాతం లో తేడాలు వస్తే రైతులకు పరిహారం అందే అవకాశం లేదు. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం బీమా పథకం ప్రకటించాలని మేము కోరుతున్నాం. వాస్తవానికి గత సంవత్సరాల నోటిఫికేషన్ల ప్రకారం జులై 15 నాటికి ప్రీమియం చెల్లింపు గడువు ముగిసిపోయింది.
( Factly,in సంస్థ వివిధ మండలాలలో గత వర్షాకాలంలో కురిసిన రోజు వారీ వర్షపాతం వివరాలను అందచేసింది. వాటి ఆధారంగా factly సంస్థ టీమ్ సభ్యులు,మిత్రులు రాకేశ్ దుబ్బుడు, సూర్య , ,రైతు స్వరాజ్య వేదిక వాలంటీర్ రాజేశ్ ఈ వర్షపాతం వివరాలను విశ్లేషించి అందించారు . వారికి ధన్యవాదాలు.
ఈ డాటా విశ్లేషించేటప్పుడు గమనించినది ఏమిటంటే వర్షపాతం వివరాలను నమోదు చేస్తున్న వాళ్ళు కనీసం జిల్లాల పేర్లు,మండలాల పేర్లు కూడా సరిగా నమోదు చేయకపోవడం. కొన్ని మండలాల పేర్లను రెండు జిల్లాలలో కూడా నమోదు చేయడం .)