21
Aug
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయం – తాజా స్థితి

2020-2021 వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళిక – 2019-2020 ఎస్ఎల్బిసి సంవత్సరిక నివేదిక
కన్నెగంటి రవి , రైతు స్వరాజ్య వేదిక, ఫోన్ : 9912928422
తెలంగాణలో అసలు సాగు భూమి యెంత ? రైతులు ఎంత మంది ?
- ఎట్టకేలకు 2020-2021 వ్యవసాయ శాఖ ప్రణాళిక బయటకొచ్చింది. ఈ నివేదిక ప్రకారం స్థూల పంట సాగు భూముల విస్తీర్ణం ఒక కోటీ 42 లక్షల 68 వేల ఎకరాలు. నికర సాగు భూముల విస్తీర్ణం ఒక కోటీ 15 లక్షల 15 వేల ఎకరాలు.
- రాష్ట్రంలో సాగు నీరు అందే స్థూల సాగు భూముల విస్తీర్ణం 77, 37,000 ఎకరాలు. నికర సాగు భూముల విస్తీర్ణం 54,16,000 ఎకరాలు( DES 2019-2020)
- 2015-2016 భూ కమతాల గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 59,48,000. రాష్ట్రంలో రైతుల సంఖ్య 53,60,000 కాగా , వ్యవసాయ కూలీల సంఖ్య 59,15,000 (DES -2019-2020 ). 2011 జనాభా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 31.60 లక్షల మంది సాగుదారులుగా నమోదు అయ్యారు. అకస్మాత్తుగా 22 లక్షల మంది రైతులు ఎలా పెరిగారో అధ్యయనం చేయాలి.
- ఈ వివరాలన్నీ ప్రభుత్వమే చెబుతున్నది. కానీ విచిత్రంగా 2020-2021 సంవత్సర వానాకాలం సీజన్ కు 1, 26,34,000 ఎకరాలకు పంటల ప్రణాళిక చేయడం వెనుక మతలబు మనకు అర్థం కాదు. ఇప్పటికే ( 12.08.2020 ) 1,20,33,667 ఎకరాలలో పంటలు సాగయినట్లు వ్యవసాయ శాఖ వారాంతపు నివేదికలు చెబుతున్నాయి. అసలు ఖరీఫ్ లో సాధారణ సాగు విస్తీర్ణమే 1,03,47,715 ఎకరాలు మాత్రమే. పెరిగిన పంటల విస్తీర్ణానికి భూమి ఎక్కడి నుండి అందుబాటులోకి వచ్చిందో తెలవదు. కూరగాయలు,పండ్లు సాగు విస్తీర్ణం దీనికి అదనం.
అమలు కాని పంటల ప్రణాళిక
- వ్యవసాయ శాఖ ప్రణాళిక ప్రకారం కాకుండా జొన్న , కంది ,పెసర,నువ్వులు, సోయాబీన్, చెరకు, ఇతర పంటలు ,పొద్దు తిరుగుడు, వేరుశనగ, ఆముదం, ఇతర నూనె గింజల విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. మొక్క జొన్న విస్తీర్ణం గురించి ప్రణాళిక లో ఏమీ లేకపోయినా, రైతులు 1,93,876 ఎకరాలలో మొక్క జొన్న సాగు చేసినట్లు నివేదిక చెబుతోంది. వరి విస్తీర్ణం మాత్రమే ప్రణాళిక కంటే పెరిగింది. పత్తి కూడా ప్రభుత్వ అంచనాలకంటే తక్కువగానే సాగైంది.
- వరి, పత్తి పెరిగి, ఇతర పంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గడం వల్ల ,ఆయా పంటల కోసం దిగుమతుల మీద ఆధార పడాల్సి వస్తుంది. రాష్ట్రంలో విపరీతమైన ఎరువుల, పురుగు విషాలు వాడకం పెరగడానికి ఇది కారణం అవుతుంది.
- ఇప్పుడు రాష్ట్రంలో యూరియా కొరతకు కారణం అదే. DAP, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతులు యూరియా వినియోగాన్ని బాగా పెంచేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఎరువుల కేటాయింపు పాత పద్ధతులలోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చివరి నిమిషం వరకూ పంటల ప్రణాళిక రూపొందించలేదు. ఫలితంగా నకిలీ విత్తనాలు రైతులు కొనుగోలు చేయవలసి వచ్చింది. ఎరువుల కొరతను కూడా రైతులు ఎదుర్కుంటున్నారు. పంటలు బీమా లేక నష్ట పోయిన రైతులు
- ఈ సంవత్సరం తెలంగాణలో పంటల బీమా పథకాలు అమలు కాలేదు. వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా రైతులు నష్ట పోయినప్పుడు ఆదుకోవడానికి పంటల బీమా పథకాలు అవసరమని రైతు స్వరాజ్య వేదిక సీజన్ ప్రారంభంలోనే స్పష్టంగా ప్రకటించింది.
కానీ ప్రభుత్వం చెవులకు ఇది ఎక్కలేదు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేలాది ఎకరాలలో రైతులు పంటలను నష్టపోయారు. ముఖ్యంగా పత్తి,కూరగాయలు,పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలు బాగా దెబ్బ తిన్నాయి. వరి కూడా ఎక్కువ రోజులు నీళ్ళలో మునిగి ఉండడం వల్ల రైతులు పంటను రక్షించుకునే విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు పంటను బతికించుకున్నా, దిగుబడులపై మాత్రం ప్రభావం చూపిస్తుంది. అగ్రికల్చర్ ఇన్షూరెన్స్ కంపెనీ (AIC) ఈ సీజన్లో పత్తి,మిరప పంటలకు వర్షాధార పంటల బీమా పథకం ప్రకటించినప్పటికీ, ఆ పథకం మార్గదర్శకాలు రైతులకు మేలు చేసేవిగా లేవు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల నష్టపోయిన పత్తి రైతులకు ఏ మాత్రం ఉపయోగ పడదు.
రైతులకు అందని సంస్థాగత పంట రుణాలు _ గత సంవత్సరం అనుభవాలు
- ఈ సంవత్సరం ఎంత మంది రైతులకు పంట రుణాలు ఇచ్చారో మనకు తెలవదు. SLBC ఏప్రిల్-జూన్ త్రైమాసిక నివేదిక 50 రోజులు గడిచినా ఇంకా వెలువడలేదు. జూలై -సెప్టెంబర్ త్రైమాసికంలో ( ఖరీఫ్ ) ఎంత మందికి రుణాలు ఇచ్చారో మనకు ఇప్పుడే తెలవదు. వస్తున్న వార్తలను బట్టి ఇప్పటి వరకూ ఎక్కువ మంది రైతులకు పంట రుణాలను బ్యాంకులు ఇవ్వలేదు. ఈ సీజన్లో 54,35,596 ఖాతాలకు 53,222.47 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
- ఈ సంవత్సరం వివరాలు లేకపోయినా గత సంవత్సర వివరాల ఆధారంగా అసలు సంస్థాగత ఋణ వ్యవస్థ ఎలా పని చేస్తుందో అర్థం చేసుకుందాం.
- ఎస్ఎల్బిసి నివేదికల ప్రకారం 2019-2020 లో ఖరీఫ్ లో 33,02,701 ఖాతాలకు 29,244.23 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని కేవలం 18,60,155 ఖాతాలకు, 13,993.30 కోట్లు మాత్రమే పంట రుణాలు ఇచ్చారు. రబీలో 22,01,801 ఖాతాలకు 19,496.18 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుని ,కేవలం 16,82,590 ఖాతాలకు 10,650.47 కోట్లు రుణాలు ఇచ్చారు. మొత్తం సంవత్సరంలో 55,04,502 ఖాతాలకు 48,740.41 కోట్లు రుణంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని కేవలం 35,42,745 ఖాతాలకు 24,643.77 కోట్లు మాత్రమే రుణంగా ఇచ్చారు. అంటే లక్ష్యంలో 60 శాతం ఖాతాలకు 50 శాతం రుణాలు మాత్రమే అందాయి .
- ఈ రుణాలు పంపిణీ జరిగిన నెలలను కూడా చూస్తే, ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ – జూన్ మధ్య 5,71,210 ఖాతాలకు రుణాలు అందాయి. ఖరీఫ్ సీజన్లో జూలై –సెప్టెంబర్ మధ్య కేవలం 12,88,945 ఖాతాలకు మాత్రమే పంట రుణాలు అందాయి. రబీ సీజన్ లో అక్టోబర్- డిసెంబర్ మధ్య 6,93,351 ఖాతాలకు రుణాలు అందగా, జనవరి-మార్చ్ నెలల మధ్య 9,89,239 ఖాతాలకు రుణాలు అందినట్లు నివేదిక చెబుతోంది.
- ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి. జూన్- జూలై మధ్య సరిగా రుణాలు అందకపోతే రైతులకు అవసరమైన పెట్టుబడి చేతిలో ఉండదు. పంటల బీమా పథకంలోకి కూడా రైతులు రారు. సాగు విస్తీర్ణం రీత్యా ఖరీఫ్ లో ఎక్కువ మంది రైతులకు రుణాలు అందాలి. కానీ మనం గమనిస్తే జనవరి-మార్చ్ మధ్యలో రైతులకు ఎక్కువ రుణాలు వెళుతున్నాయి. కారణం- ఆర్ధిక సంవత్సరం ముగిసేలోగా లక్ష్యాలను చేరినట్లు చూపించుకోవడానికి బ్యాంకులు తాపత్రయ పడుతున్నాయి తప్ప,రైతుల పెట్టుబడి అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం లేదు. పైగా ఈ ఋణ పంపిణీలో ఎంత మందికి నిజంగా రుణం చేతిలోకి వస్త్జుందో , ఎంత మందికి వడ్డీ కట్టించుకుని రుణం ఇచ్చినట్లుగా కేవలం రెన్యూవల్ చేస్తున్నారో బ్యాంకు అధికారులకే తెలవాలి.
- 2020-2021 సంవత్సరం ఖరీఫ్ లో 13,20,546 ఖాతాలకు పత్తి పంటకు గాను 12,703.70 కోట్లు రుణంగా ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి . కానీ ఈ సంవత్సరం 57,99,545 ఎకరాలలో పత్తి సాగు అయింది. వాస్తవానికి ఎకరానికి 35,000 రూపాయల స్కేలు ఆఫ్ ఫైనాన్స్ చొప్పున ఇంత విస్తీర్ణానికి 20,298.40 కోట్ల రుణం ఇవ్వవలసి ఉంటుంది. ఆచరణలో ఎంత ఇచ్చారో వేచి చూడాలి.
- 2015-2016 భూ కమతాల గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 59,48,000 భూ కమతాలు ఉన్నాయి. ఇందులో సన్నకారు కమతాలు 38,40,000 కాగా,వీరికి 17,07,790 పంట ఋణ ఖాతాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో కేవలం 8,53,110 ఖాతాలకు మాత్రమే పంట రుణాలు అందాయి. చిన్నకారు కమతాలు 14,09,000 కాగా, 29,69,618 ఖాతాలు ఉన్నాయి. ఇందులో ఈ సంవత్సరం పంట రుణాలు పొందిన ఖాతాలు 21,00,112 అని నివేదిక చెబుతోంది. మిగిలిన రైతుల కమతాలు 6,79,000 కాగా, ఇందులో 2,79,260 పంట రుణ ఖాతాలు ఉన్నాయి . వీరిలో 2,13,983 ఖాతాలకు రుణాలు అందాయి. ఈ సంవత్సరం కొత్త రైతులకు 2,78,486 ఖాతాలు ఓపెన్ అయ్యాయి .వీరిలో 2,76,080 ఖాతాల రైతులు రుణాలు పొందారు .
- మరింత లోతుగా ఈ గణాంకాలను అధ్యయనం చేయాల్సి ఉంది. ముఖ్యంగా చిన్న కారు కమతాల కంటే, వారి పేరున బ్యాంకు ఖాతాలు ఎందుకు ఎక్కువ ఉన్నాయి అన్నది పరిశీలించాలి. అలాగే కొత్తగా బ్యాంక్ ఖాతాలు పొందిన వారిలో ఎక్కువ మందికి రుణాలు ఎలా అందాయి అన్నది పరిశీలించాలి. అలాగే LEC కార్డులు ఉన్న వారికి రుణాలు ఇస్తున్నట్లుగా నివేదిక చెబుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో LEC కార్డులు జారీ కావడం లేదు. మరి ఈ LEC ల పేరున రుణాలు పొందుతున్న వాళ్లు ఎవరు .. ?
దళితులకు 3 ఎకరాల భూమి కొనుగోలు :
- 2020-2021 ఆర్ధిక సంవత్సరంలో ( 5 నెలలు ) కేవలం 3 జిల్లాలలో 107 మంది రైతులకు కేవల్మ్ 141.51 ఎకరాల భూమిని మాత్రమే కొనుగోలు చేసి ఇచ్చారు.
Xxxxxxx