తెలంగాణ లో పత్తి పంట సాగు – ఒక పరిశీలన

తెలంగాణా రాష్ట్రంలో పత్తి ఇప్పటికే ఒక ప్రధానమైన పంట.దీనిని వచ్చే వానాకాలం సీజన్ లో 70 లక్షల ఎకరాలలో సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మా రైతు స్వరాజ్య వేదిక అభిప్రాయాలు..అన్ని గణాంకాలను పరిశీలిస్తే తెలంగాణ లో రైతులకు పత్తి పంట చాలా రిస్క్ తో కూడి ఉంటుంది. ఖర్చులు ,ధరల ప్రకారం పెద్దగా ఉపయోగం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరింత పత్తి సాగును పెంచాలని చూడడం ఆత్మహత్యా సదృశ్యం..
Ravi Kanneganti, Rythu Swarajya Vedika
1. 2019 ఖరీఫ్ పంటల సాగు వివరాల ప్రకారం రాష్ట్రంలో ఆగస్టు 21 నాటికి 17,61,598 హెక్టార్లలో పత్తి సాగయింది. సాధారణ పత్తి సాగు విస్తీర్ణం (17,24,982 హెక్టార్లు) మించి ఈ సంవత్సరం మరో 2 శాతం ఎక్కువ సాగయింది.
2.మొత్తం సాధారణ పంటసాగు విస్తీర్ణం తెలంగాణాలో 43,34,487 హెక్టార్లు కాగా, అందులో 40 శాతం విస్తీర్ణంలో పత్తే సాగవుతున్నదంటే ఈ పంటకు ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.
3. తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లాలో పంట సాగు భూములు లేవు. మిగిలిన 32 జిల్లాలకుగాను, ఒక్క మేడ్చల్ తప్ప, మిగిలిన 31 జిల్లాలలోనూ పత్తి సాగవుతున్నది. అన్ని రకాల భూములలోనూ పత్తిని సాగు చేస్తున్నారు. నీటి పారుదల సౌకర్యాల క్రిందే కాకుండా, వర్షాధార భూములలోనూ పత్తి పంట సాగు చేస్తున్నారు. దీని వల్ల ఆయా జిల్లాలలో సగటు దిగుబడుల మధ్య తీవ్ర వ్యత్యాసాలున్నాయి.
4. పత్తి సాగు విస్తీర్ణం పెరగడంపై రైతు స్వరాజ్య వేదిక చేసిన ఒక అధ్యయనం ప్రకారం, పత్తి సాగుకు బ్యాంకులు అందించే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (ప్రస్తుతం హెక్టారుకు 87,500 రూపాయలు) కూడా ఒక ప్రధాన కారణమని అర్థం అయింది. అలాగే రాష్ట్రంలో కోతులు, అడవి పందుల వల్ల ఇతర పంటలు సాగు చేసే పరిస్థితి లేదనీ, ఈ జంతువులు పత్తి జోలికి రావుగనుక ఈ పంటను సాగు చేస్తున్నామనీ రైతులు చెప్పారు. వాస్తవానికి తాజా పరిస్థితులలో కోతులు, ఒక దశలో పత్తి కాయలను చెట్ల నుంచి తెంచి, కొరికి పడేస్తున్నాయని రైతులే చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితులను, ఒక మేరకు పత్తి తట్టుకుంటుందనీ, మిగిలిన పంటలు తట్టుకోలేవనీ రైతుల అభిప్రాయం. పత్తిలో కనీస దిగుబడి తప్పకుండా వస్తుందని, పైగా పండగల సీజన్ అయిన అక్టోబర్, నవంబర్లలో పత్తి చేతికి వస్తుంది కనుక, రైతుల డబ్బు అవసరాలను తీరుస్తుందని, పత్తికి మార్కెటింగ్ వ్యవస్థ గ్రామ స్థాయి వరకు విస్తరించి ఉందని, మిగిలిన ఏ పంటకు ఇంత గ్యారంటీ లేదని, అందుకే పత్తిని సాగు చేస్తున్నామని రైతుల అభిప్రాయం.
5. దేశ వ్యాపితంగా పత్తి పంట సాగు, వినియోగం వివరాలు పరిశీలిస్తే పత్తి ఉత్పత్తి, ఎగుమతి, దిగుమతులు ప్రస్తుతం బేలన్స్ అవుతున్నవి. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి విస్తీర్ణం, దిగుబడులు, ధరలు కూడా భారతదేశ మార్కెట్‌ను, రైతులను ప్రభావితం చేస్తున్నాయి. మన మిల్లుల అవసరాలను ప్రస్తుత పత్తి ఉత్పత్తి తీర్చగలుగు తున్నప్పటికీ, ఎగుమతులలో స్థబ్ధత వుంది. పైగా అంతర్జాతీయ మార్కెట్లో పత్తి తక్కువ ధరలకు లభిస్తున్నప్పుడు, భారత మిల్లుల యాజమానులు కూడా, పత్తి దిగుమతుల కోసం పరుగులెత్తు తున్నారు. లేదా భారతదేశ మార్కెట్లో పత్తి ధరలను పడేస్తున్నారు. ఫలితంగా రైతులు, కేవలం వర్షాభావ పరిస్థితులలో దిగుబడులు తగ్గి మాత్రమే కాకుండా, పత్తి బాగా పండిన సందర్భాలలో కూడా రైతులకు ధరలు అందక నష్టపోతున్నారు.
7. కనీస మద్ధతు ధరలు ( ఎం.ఎస్.పి) ప్రకటించే పంటలలో పత్తి ఉత్పత్తికి సంబంధించి తెలంగాణా రాష్ట్రం 14 శాతం వాటాను కలిగి వుంది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం పత్తి సగటు దిగుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెక్టారుకు 20 క్వింటాళ్ళు (ఎకరానికి 800 కిలోలు). వ్యవసాయ ఖర్చుల, ధరల నిర్ణాయక కమీషన్ (సి.ఎ.సి.పి) అంచనా ప్రకారం హెక్టారుకు 16 క్వింటాళ్ళ 63 కిలోలు (ఎకరానికి 660 కిలోలు).
8. పత్తి పంటకు సంబంధించి సి.ఎ.సి.పి నివేదికలో మరికొన్ని అంశాలు మనం పరిశీలించాలి. 2019-20 సంవత్సరానికి కనీస మద్ధతు ధరలను ప్రకటించడానికి సాధారణంగా సి.ఎ.సి.పి. 2015-16, 2016-17 సంవత్సరాల ఉత్పత్తి ఖర్చులను పరిగణనలోకి తీసుకున్నది. ఈ నివేదిక ప్రకారం పత్తి పంట హెక్టారు ఉత్పత్తి ఖర్చు 2015-16లో 73,661.72 రూ.లు కాగా, అది 2016-17కు 83,117.08 రూ.లకు (అంటే హెక్టారుకు 10 వేల రూపాయలు) పెరిగింది. కానీ సగటు దిగుబడుల విషయానికి వస్తే 2015-16లో హెక్టారుకు 14.52 క్వింటాళ్ళు కాగా, 2016-17లో అది 18.29 క్వింటాళ్ళకు పెరిగింది. ఫలితంగా పంట సాగు ఖర్చు (ఎ2) + కుటుంబ శ్రమ విలువ (ఎఫ్.ఎల్) కలిపి 2015-16లో క్వింటాలుకు 3,633.23 కాగా 2016-17లో క్వింటాలుకు 2,935.34 రూపాయలకు పడిపోయింది. సమగ్ర ఉత్పత్తి ఖర్చు (సి2) క్వింటాలుకు 5,067.31 రూపాయల నుండి 4,544.69 రూపాయలకు పడిపోయింది. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో పత్తి పంట సాగు వివరాలు. తెలంగాణా రాష్ట్ర వివరాలు సి.ఎ.సి.పి. నివేదికలో లేవు. దేశ ఉత్పత్తిలో 14 శాతం వాటా కలిగి ఉన్న తెలంగాణా రాష్ట్ర పత్తి పంట వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సి.ఎ.సి.పి.కి అందించడం లేదో మనకు అర్థం కాదు. దాని వల్ల మొత్తంగా మద్ధతు ధరలు పొందడంలో పత్తి రైతులు నష్టపోతున్నారన్నది వాస్తవం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ 2019-20 సంవత్సరం అంచనా ప్రకారం దిగుబడి 20 క్వింటాళ్ళు పత్తి పంట సమగ్ర ఉత్పత్తి ఖర్చు అంచనా 5,355 రూపాయలు (20 క్వింటాళ్ళుకు) కాగా సి.ఎ.సి.పి. అంచనా 5,103 రూపాయలు (16.63 క్వింటాళ్ళు). 2019-20సంవత్సరానికి ప్రకటించిన కనీస మద్ధతు ధర క్వింటాలుకు 5,550 రూపాయలు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుల అంచనా ప్రకారం రైతుకు క్వింటాలుకు నికరంగా మిగిలేవి 145 రూపాయలు. అంటే ఎకరానికి 8 క్వింటాళ్ళ చొప్పున నికర మిగులు 1,160 రూపాయలు. 8నెలల పంటకు ఎకరానికి నికర మిగులు ఇది. సి.ఎ.సి.పి. లెక్క ప్రకారం చూసినా క్వింటాలుకు నికర మిగులు 497 రూపాయలు. అంటే ఎకరానికి 660 కిలోలకు గాను సుమారు 3,280 రూపాయలు మాత్రమే నికర మిగులు.
10. పైగా సమగ్ర ఉత్పత్తి ఖర్చులలో పంట బీమా ప్రీమియం, రవాణా ఖర్చులు కలపడం లేదు. ఇది కూడా కలిపితే ఉత్పత్తి ఖర్చు మరింత పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మద్ధతు ధరలను ప్రకటించేటప్పుడు పంట సాగు ఖర్చు (ఎ2) + కుటుంబ శ్రమ (ఎఫ్.ఎల్)ను దృష్టిలో వుంచుకుని, కొంత మొత్తాన్ని కలిపి మద్ధతు ధరలను ప్రకటిస్తున్నది. సి2+50 శాతం ప్రాతిపదికన కనీస మద్ధతు ధరను నిర్ణయించాలని స్వామినాథన్ కమీషన్ సిఫారసు చేసినా, దానిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
11. తెలంగాణా రాష్ట్రంలో పత్తి పంటకు హెక్టారుకు 87,500 రూ.లు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను ప్రాతిపదికగా తీసుకుని పంట బీమా మొత్తాన్ని నిర్ణయించారు. అంటే బ్యాంకులు ఇంత మొత్తాన్ని రైతుకు పంట రుణంగా ఇవ్వాలన్నమాట. పైగా బీమా మార్గదర్శకాల ప్రకారం బీమా ప్రీమియం మొత్తాన్ని రైతుకు ఇచ్చే రుణానికి అదనంగా కలిపి, పంట రుణంగా ఇవ్వాలి. కానీ చాలా సందర్భాలలో బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే రుణాలు ఇవ్వడం లేదు.
12. 2019 మే 3న విడుదలైన వాతావరణ ఆధారిత పంట బీమా నోటిఫికేషన్ ప్రకారం క్లస్టర్ 1, క్టస్టర్ 3 జిల్లాలకు ఇఫ్కో – టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, క్లస్టర్ 3, 4, 5, 6 లకు వ్యవసాయ బీమా కంపనీ పత్తి పంటకు బీమా చేస్తున్నాయి. ఈ కంపనీలు వసూలు చేస్తున్న మొత్తం ప్రీమియం రేట్లను చూస్తే, 5 జిల్లాలలో 22.25 శాతం, 6 జిల్లాలలో 22 శాతం 7 జిల్లాలలో 25 శాతం, 5 జిల్లాలలో 20 శాతం, 8జిల్లాలో 15 శాతం చొప్పున ప్రీమియం వసూలు చేస్తున్నాయి. ప్రీమియం మొత్తంలో 5 శాతం రైతు వాటాగా చెల్లిస్తుండగా, మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తున్నాయి.
13. అంటే బీమా ప్రీమియం క్రింద రైతు వాటాగా హెక్టారుకు 4,375 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అంటే ఎకరానికి కనీసం 1780 రూపాయలు అన్నమాట. రైతుకు నికర మిగులు, బీమా ప్రీమియం చెల్లింపుకు సరిపోయినంత కూడా లేదన్నమాట. నిజంగా బ్యాంకులు రైతులకు పంట రుణం ఇచ్చి, బీమా ప్రీమియం మినహాయించు కుంటే, ప్రకృతి వైపరిత్యాల సమయంలో రైతుకు పరిహారం వస్తుంది. లేనట్లయితే రైతు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం వుంది. మరీ ముఖ్యంగా వర్షాధార ప్రాంత పత్తి రైతులు నష్టపోతారు.
14. ఏఏ సందర్భాలలో పత్తి రైతుకు పరిహారం అందుతుందో కూడా పరిశీలించాలి. ఈ పరిశీలనకు అత్యంత కీలకమైనది, నిర్ధిష్ట మండలంలో జూన్ నెల నుండీ సెప్టెంబర్ వరకూ కురిసిన వర్షపాతం రోజువారీ సమాచారం.
కానీ, రైతులకు రోజు వారీగా, నెలల వారీగా, ప్రతి మండలం వారీగా, ఎంత వర్షపాతం ఉన్నదో తెలవడం లేదు. కాబట్టి తమకు ఇన్సూరెన్స్ వస్తుందో రాదో కూడా రైతులకు అంచనా ఉండడం లేదు.
పత్తి పంటకు బీమా ప్రీమియం అత్యధికంగా ఉంది.
మొత్తం హెక్టారుకు – 87,500 రూపాయలలో
25 శాతం ప్రీమియం అంటే – 21,875/- 20 శాతం ప్రీమియం అంటే – 17,500/- రైతు చెల్లించే 5 శాతం ప్రీమియం అంటే – 4,375/- |
తెలంగాణలో పత్తి పంట..వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం
1. నోటిఫికేషన్ తేది: 3-5-2019
2. మేడ్చల్ తప్ప అన్ని జిల్లాలు
3. క్లస్టర్ – 1, క్టస్టర్ -3 లకు ఇఫ్-కో, టోక్యో జనరల్ ఇన్యూరెన్స్ కంపనీ, క్టస్టర్ -2, 4, 5, 6 క్లస్టర్ ఎ.ఐ.సి. – బాధ్యత
4. పత్తి పంటకు బీమా మొత్తం – (87500 / హెక్టారుకు) జిల్లా వారీగా ప్రీమియం శాతం ఇలా ఉంటుంది.
1 కొమురం భీం 22 శాతం 2. ఆదిలాబా ధ్ 22 శాతం 3. మంచిర్యాల 22 శాతం 4 భూపాలపల్లి 22 శాతం 5. సిద్ధిపేట 22 శాతం 6. ములుగు 22 శాతం 7. కామారెడ్డి 22 శాతం 8. నిర్మల్ 20 శాతం 9. నిజామాబాద్ 25 శాతం 10. రంగారెడ్డి. 15 శాతం 11. యాదాద్రి 20 శాతం 12. జగిత్యాల 22.25 శాతం 13. జనగాం 22.25 శాతం 14. కరీంనగర్ 22.25 శాతం 15. పెద్ద పల్లి. 22.25 శాతం 16. సిరిసిల్ల 22.25 శాతం 17. ఖమ్మం 15 శాతం 18. మెదక్ 15 శాతం 19. నల్గొండ 20 శాతం 20. సంగారెడ్డి 15 శాతం 21. సూర్యాపేట 15 శాతం 22. కొత్తగూడెం 15 శాతం 23. నాగర్ కర్నూల్ 20 శాతం 24. వనపర్తి 15 శాతం 25. వరంగల్ (అర్బన్) 15 శాతం 26. గద్వాల్ 25 శాతం 27. మహబూబ్‌నగర్ 25 శాతం 28. నారాయణపేట 25 శాతం 29. మహబూబాబాద్ 25 శాతం 30. వికారాబాద్ 25 శాతం 31. వరంగల్ (రూరల్) 20 శాతం 32. మేడ్చల్ – 0 33. హైదరాబాద్ – 0 |