Bt Cotton in India: Myths and Realities

భారత దేశంలో బిటి పత్తి – సాంకేతిక పరిజ్ఞానపు వైఫల్యం
అంతర్జాతీయ వెబినార్ ముఖ్య అంశాలు
భారత దేశంలో బిటి పత్తి సాగు పై నిర్వహించిన ఒక అంతర్జాతీయ వెబినార్ లో బిటి పత్తి పరిజ్ఞానం భారతదేశపరిస్థితులకు అనుగుణంగా లేకపోవటంతో అది విఫలమైందని ప్రముఖ శాస్త్రవేత్తల పానెల్ సాక్ష్యాలతో సహా వివరించింది. సుస్థిర వ్యవసాయ కేంద్రం(CSA) మరియు జతన్ సంస్థలు నిర్వహించిన ఈ వెబినార్ భారతదేశంలో అనుమతించబడిన 18 సంవత్సరాల బిటి పత్తి సాగు పై సాక్ష్యాల ఆధారంగా చేసిన సమీక్ష (మూల్యాంకనం)పై కేంద్రీకరించింది. ఈ వెబినార్ పానెల్ లో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు – అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సహజ వనరుల కళాశాలలో సీనియర్ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ ఆండ్రూ పాల్ గుటిఎరేజ్, కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ మాజీ డైరెక్టర్ డాక్టర్ కేశవ్ క్రాంతి, భారతదేశంలో ఎఫ్.ఏ.ఓ మాజీ ప్రతినిధి డాక్టర్ పీటర్ కెన్ మోర్, ప్రపంచ ఆహార బహుమతి పొందిన డాక్టర్ హాన్స్ హరేన్ పాల్గొన్నారు.
ఈ వెబినార్ లో మాట్లాడుతూ డాక్టర్ పీటర్ కెన్ మోర్ బిటి పత్తి పురుగుమందులను నియంత్రించే కాలం చెల్లిన పరిజ్ఞానం అని అన్నారు. “అది ఆర్సెనిక్ – డిడిటి ల నుండి బి హెచ్ సి – ఎండో సల్ఫాన్ – మోనోక్రోటోఫాస్ – కార్బారిల్ నుండి ఇమిడా క్లొప్రిడ్ వంటి అనేక తరాల పురుగుమందుల అణువులతో అరిగిపోయి, అలవాటు పడిపోయిన దారినే అనుసరిస్తుంది”.అంతర్గతంగా జరిగే పరిశోధనలో ప్రతి అణువును జీవ రసాయనపరంగా. చట్టపరంగా, వాణిజ్య పరంగా ఒక సంపూర్ణ ప్యాకేజ్ గా తయారుచేసి ఆ తర్వాతనే దానిని బహిరంగంగా విడుదల చేసి అమలులోకి తేవటం జరుగుతుంది. కార్పొరేటు మరియు ప్రభుత్వ విధాన కర్తలు ఆ తర్వాత దానితో దిగుబడి పెరుగుతుందని ప్రకటిస్తారు, కానీ తాత్కాలికంగా తెగుళ్లను అణచటం, ద్వితీయ తెగుళ్లు విడుదలవడం, తెగుళ్లను తట్టుకునే శక్తి తాత్కాలికంగా ఉండటం తప్ప అందులో మరేమీ జరగదు. బిటి పత్తి సాగులో మళ్ళీ మళ్ళీ సంక్షోభాలు ఏర్పడటంతో పౌర సమాజం స్పందించి నిబద్ధత గల శాస్త్రవేత్తలు పర్యావరణ దృష్టి నుండి క్షేత్ర స్థాయి పరిశోధన సాగించటానికి దారితీసింది. రైతు బృందాలు ఇటువంటి పరిశోధన చేసినప్పుడు, స్థానికంగా అనుసరించే పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను వారు సృష్టిస్తారు. వారి పర్యావరణ అనుకూల వ్యవసాయానికి ఇప్పుడు పౌర సమాజ సంస్థలు, ప్రభుత్వాలు, ఐక్య రాజ్య సమితి – ఆహార వ్యవసాయ సంస్థల నుండి ప్రపంచ స్థాయి మద్దతు లభిస్తున్నది. భారతదేశంలో పత్తి సాగులో బలమైన స్థానిక పరిష్కారాలు ఉన్నందున బిటి పత్తి లో ఉన్నటువంటి ఎండో టాక్సిన్స్(అంతర్గత విషాల) తో సహా కొత్త అణువుల అవసరం లేదు” అని అయన అన్నారు.
బిటి పత్తి భారతదేశంలో ఆమోదించబడిన మొట్టమొదటి ఏకైక జన్యు మార్పిడి పంట. దానిని భారతదేశంలో 20 ఏళ్లకు పైగా సాగుచేస్తున్నారు, మొదట చట్టవిరుద్ధంగా జరిగింది, తర్వాత ప్రభుత్వ అనుమతులతో చట్టపరంగా సాగవుతున్నది. భారతదేశం లో నాయకులు, సాంకేతిక పరిజ్ఞానాలను ప్రోత్సహించే వారు బిటి పత్తి సాగు గురించి అనుకూలమైన అతిశయోక్తి తో కూడిన చిత్రాన్ని ముందుకు తెచ్చారు. క్షేత్ర స్థాయిలో రైతులు బిటి పత్తికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలవైపు, బిటియేతర పత్తి రకాల వైపు మళ్లుతున్నారు.
ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ పరిమాణాత్మక పత్తి సాగు వ్యవస్థలలో పనిచేసే పర్యావరణ శాస్త్రవేత్తగా పరిగణించబడే ప్రొఫెసర్ ఆండ్రూ పాల్ గుటిఎరేజ్ భారత దేశంలో బిటి పత్తి ఎందుకు విఫలమయ్యిందో వివరించే పర్యావరణపరమైన కారణాలను వివరించారు. కాలిఫోర్నియాలో 1960, 1970 లలో పురుగుమందులను ప్రవేశపెట్టడం మూలంగా తెగుళ్లు ప్రబలటం జరిగింది,ఆ తప్పులనుండి భారత దేశం గుణపాఠం నేర్చుకుని ఉండాల్సింది. భారతదేశంలో ప్రవేశపెట్టిన దీర్ఘకాల పంట రకాన్ని హైబ్రీడ్ల లోకి చేర్చటం వల్ల రైతులను జీవ సాంకేతిక పరిజ్ఞానం, పురుగుమందుల విషవలయపు ఉచ్చులోకి లాగిందని అయన నిరూపించాడు. “దీర్ఘ కాల హైబ్రిడ్ పత్తి సాగు భారత దేశంలో మాత్రమే జరుగుతుంది. అది దిగుబడి పెరగటానికి దోహదపడదు, పైగా తక్కువ దిగుబడి స్థాయిలో నిలిచిపోవటానికి పెద్ద ఎత్తున కారణం అవుతుంది, దానితో పాటు ఉత్పత్తి ఖర్చు పెరగటానికి దారి తీస్తుంది” అని అయన వివరించారు. పత్తి రైతులలో ఆత్మహత్యలు పెరగటం, తత్ఫలితంగాఏర్పడుతున్న సంక్షోభం పత్తి సాగుతో సంబంధం కలిగి వుంది అని ప్రొఫెసర్ గుటిఎరేజ్ నొక్కి చెప్పారు. “ జన్యు మార్పిడి చేయని మేలైన తక్కువ కాలపు ఫలవంతమైన పత్తి రకాలను సాగు చేయటమే ప్రస్తుత జన్యు మార్పిడి హైబ్రిడ్ వ్యవస్థకు లాభకరమైన పరిష్కారం” అని అయన చెప్పారు.
ప్రస్తుతం అంతర్జాతీయ పత్తి సలహాదారుల కమిటీ లో వున్న డాక్టర్ కేశవ్ క్రాంతి బిటి పత్తి దిగుబడులు, పురుగుమందులవినియోగం, నీటి పారుదల, ఎరువుల వినియోగం, తెగుళ్లు సోకటం, తెగుళ్లను తట్టుకునే శక్తిని పెంచుకోవటం వంటి అంశాలకు సంబంధించిన గణాంకాలను వివరించారు. “ 2005 లో 11.5% గా, 2006 లో 37.8% గా వున్న పత్తి సాగువిస్తీర్ణం 2011 నాటికి దాదాపు అత్యధిక విస్తీర్ణానికి చేరినప్పటికీ భారతదేశంలో బిటి హైబ్రిడ్ పరిజ్ణానం గత 15 ఏళ్లలో దిగుబడి విషయంలోకానీ పురుగుమందుల వినియోగం విషయంలో కానీ ఎటువంటి స్పష్టమైన ప్రయోజనాలను అందించలేదని అధికార గణాంకాలను (eands.dacnet.nic.in & cotcorp.gov.in) విమర్శనాత్మకంగా విశ్లేషిస్తే తెలుస్తున్నది అని అయన అన్నారు.ఉదాహరణకు మహారాష్ట్ర లో బిటి హైబ్రిడ్ పత్తి అత్యధిక విస్తీర్ణంలో సాగవుతూ అత్యధిక పురుగుమందుల వినియోగం జరుగుతున్నప్పటికీ అక్కడ పత్తి దిగుబడులు ప్రపంచంలో కెల్లా అత్యంత తక్కువగా వున్నాయి. మహారాష్ట్రలో పత్తి దిగుబడులు, బిటి హైబ్రీడ్లు, ఎరువులు పురుగుమందులు మొదలైన ఎటువంటి పరిజ్ఞానాలను ఉపయోగించని వర్షాధారిత ఆఫ్రికాలో కంటే కూడా తక్కువగా వున్నాయి. భారతదేశపు బిటి పత్తి దిగుబడులు ప్రపంచంలో 36వ స్థానంలో వున్నాయి.మరొకవైపు 2005 తర్వాత బిటి పత్తి విస్తీర్ణం పెరిగినప్పటికీ గత 15 ఏళ్లుగా దిగుబడులు ఒకే స్థాయిలో నిలిచిపోయాయి, పురుగుమందుల వినియోగం నిలకడగా పెరుగుతున్నది. బిటి హైబ్రిడ్ పరిజ్ఞానం, సుస్థిరత పరీక్షలో విఫలమైందని కూడా పరిశోధన తెలియజేస్తున్నది. 2014-15 లో బిటి పత్తిలో గులాబీ కాయతొలిచే పురుగు తట్టుకునే శక్తిని పెంచుకున్నది, రసం పీల్చే పురుగు ఆశించటం పెరుగుతున్నది, ఎరువులు పురుగుమందుల వినియోగం పెరిగే ధోరణిలోనే వున్నది, ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయి, నికర ఆదాయం నష్టంలో వుంది” అని అయన చెప్పారు.
వ్యవసాయ శాస్త్రం(అగ్రానమి) – ప్లాంట్ బ్రీడింగ్ లో ఎంఎస్సి, సూక్ష్మ జీవుల నియంత్రణ లో పి.హెచ్.డి. పట్టాలు పొందిన డాక్టర్ హాన్స్ హరేన్ ఈ వెబినార్ లో పాట్లాడుతూ ఇలా చెప్పారు: “ జన్యు మార్పిడి జీవులను ఆచరణ కోసం వెతుకుతున్న పరిజ్ఞానానికి ఒక ఉదాహరణ గా చెప్పుకోవచ్చు. మొక్కలు, జంతువుల జన్యు వ్యవస్థను మార్చటం అనేది రైతులు, వినియోగదారులు, ఆహార భద్రతల ను లాభాల కోసం పణంగా పెట్టే స్వల్పకాలిక చర్య మాత్రమే. దానికి సంబంధించినపరిజ్ఞానం, సమస్య యొక్క మూల కారణాలను కాక లక్షణాలకు చికిత్స అందిస్తుంది. సమస్య మూలకారణాలను పరిష్కరించటం అంటే ఒక విశాలమైన అర్ధంలో సుస్థిరమైన, ఉత్పాదకమైన, జీవవైవిధ్య ఆహార వ్యవస్థను సృష్టించే వ్యవస్థాగత పద్దతిని అనుసరించటం మరియు సామాజిక, పర్యావరణపరమైన, ఆర్ధిక కోణాలనుండి తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలను అందించటం అవుతుంది. బిటి పత్తి వైఫల్యం అంటే కేవలం దాని వెనుకనున్న పరిజ్ఞానం, ఉత్పత్తి యొక్క వైఫల్యం మాత్రమే కాదు, అది అవాంఛనీయమైన మొక్కల సంరక్షణ శాస్త్రానికి, వ్యవసాయ అభివృద్ధి తప్పుడు దిశలో దారి తీస్తుందనటానికీ ప్రామాణికంగా ప్రాతినిధ్యం వహిస్తుంది. భారతదేశంలో బిటి-హైబ్రిడ్ పరిజ్ఞానం తప్పులతో కూడిన విధానం, అది దేశంలో పత్తి పంట పునరుద్ధరణకు నిజమైన పరిష్కారాలను తిరస్కరించి, అమలుచేయకపోవటానికి దారి తీసింది. నిజమైన పరిష్కారాలు అంటే అధిక సాంద్రత తక్కువ కాలపరిమితి (హైడెన్సిటీ షార్ట్ సీజన్-HDSS) గల బిటి యేతర, జన్యు మార్పిడి చేయని పతి రకాలు, మన దేశీ జాతులకుచెందిన, అమెరికన్ పత్తి జాతులకు చెందిన స్వచ్ఛమైన రకాలు సాగుచేయటం. ఈ భూగోళ వ్యవస్థలో సభ్యులుగా మనం మనగలగటానికీ, మన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవటానికి ఏకైక మార్గం వ్యవసాయాన్ని, ఆహార ఉత్పత్తి వ్యవస్థను పర్యావరణ అనుకూల వ్యవస్థగా మార్పు చేయటమే- అందులో పునరుద్దరించే, సేంద్రియ, బయోడైనమిక్, పర్మాకల్చర్, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఇమిడి ఉంటాయి. ఈ మార్పును ఆధారం లేని వాదనలతో అడ్డుకునే స్వలాభం చూసుకునే శక్తులను పక్కకు నెట్టివేయాలి. “ ప్రపంచానికి ఎక్కువ ఆహారం అవసరం వుంది”, అందుకోసం పురోగామి స్వభావం గల విధానాలను, వాతావరణ మార్పుకు అనుగుణమైన విధానాలు రూపొందించి అమలుచేయాలి, కోవిద్-19 అనంతర సంక్షోభాన్ని పరిష్కారించాలి అనే వాదనలను ఈ శక్తులు ముందుకు తెస్తున్నాయి, వాటిని మనం ఓడించాలి. ఆహారం, పోషకాల భద్రతను సాధించే పర్యావరణ అనుకూల వ్యవసాయ పధ్దతులకు అవసరమైన శాస్త్రీయ, ఆచరణీయ సాక్ష్యాలన్ని మనకున్నాయి”.
భారతదేశంలో అనేక జన్యుమార్పిడి ఆహార పంటలు ఆమోదం కోసం, పరీక్షల కోసం వేచి వున్నాయి. వాటిలో బిటి వంకాయ (మహికో తయారు చేసిన వంకాయ కాకుండా ), ఢిల్లీ విశ్వవిద్యాలయం రూపొందించిన కలుపు మందును తట్టుకునే జన్యు మార్పిడి ఆవ రకం, జన్యు మార్పిడి మక్కజొన్న వాణిజ్యపరమైన విడుదల కోసం నియంత్రణ అనుమతులకు ముందు వరుసలో వున్నాయి .
ఈ అంతర్జాతీయ వెబినార్ ను అలయన్స్ ఫర్ సస్టైనబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ (ASHA ), ఇండియా ఫర్ సేఫ్ ఫుడ్ వేదికలతో కలసి సుస్థిర వ్యవసాయ కేంద్రం, జతన్ సంస్థలు నిర్వహించాయి. ఈ వెబినార్ లో ప్రపంచ వ్యాప్తంగా వందలాది మంది శాస్త్రవేత్తలు, రైతులు, పౌరులు మొత్తం 500 మందికి పైగా పాల్గొన్నారు.
For more information, contact :
Dr. G V Ramanjaneyulu – 9000699702; Kapil Shah – 7567916751; Kavitha Kuruganti – 8880067772
వక్తల పరిచయం

ప్రొఫెసర్ డాక్టర్ ఆండ్రూ పాల్ గుటిఎరేజ్ అమెరికాలోని బెర్క్లి లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సహజ వనరుల కళాశాలలో సీనియర్ విశ్రాంత ఆచార్యులు. అయన కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సమగ్ర పురుగు యాజమాన్య కార్యక్రమం వ్యవస్థాపకులు, జాతీయ NSF/EPA/USDA IPM ప్రాజెక్టులకు సహ సంచాలకులు. అయన సుస్థిర వ్యవసాయ పద్ధతుల విశ్లేషణ కేంద్రం (CasasGlobal.org) చీఫ్ ఎగజిక్యూటివ్ ఆఫీసర్, ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అనేక పంటల సాగు వ్యవస్థలలో పరిశోధనలు సాగిస్తున్నది. ఆయనను ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ పరిమాణాత్మక పత్తి సాగు వ్యవస్థలలో పనిచేసే పర్యావరణ శాస్త్రవేత్తగా పరిగణిస్తారు, అయన పత్తి దాని జీవావరణ వ్యవస్థల పై ఐదు ఖండాలలో 50 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.
ప్రొఫెసర్ డాక్టర్ హాన్స్ ఆర్ హరేన్ – అమెరికాలోని బయోవిజన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు, మిలీనియం ఇన్స్టిట్యూట్ అధ్యక్షులు. కెన్యాలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫార్ ఇన్సెక్ట్ సైకాలజీ అండ్ ఎకాలజి సంస్థకు 2005 వరకు డైరెక్టర్ జనరల్ గా వున్నారు. నైజీరియాలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అగ్రికల్చర్ లో ప్లాంట్ హెల్త్ విభాగానికి డైరెక్టర్ గా (1979-94) పనిచేశారు. ఆయనకు 2013 రైట్ లైవ్లీ హుడ్ బహుమతి, 1995 లో ప్రపంచ ఆహార బహుమతి , 2003 లో ఎన్విరాన్ మెంట్ అచీవ్ మెంట్ కోసం టైలర్ బహుమతి లభించాయి. అయన ఎన్ ఏ ఎస్ లో థర్డ్ వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో సభ్యత్వం, IPES – ఫుడ్ లో సభ్యత్వం, IFOAM-OI World Board సభ్యత్వం వున్నాయి.. అయన ఐక్య రాజ్య సమితి మరియు ప్రపంచ బ్యాంకు స్పాన్సర్ చేసిన ఇంటర్నేషనల్ అసెస్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నాలెడ్జ్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫార్ డెవెలప్మెంట్ (IAASTD, 2009) కు కో కన్వీనర్.
డాక్టర్ పీటర్ ఇ. కెన్ మోర్ హరిత విప్లవ వరి లో మకార్దర్ ఫెల్లో (Genius Award), ఆహార వ్యవసాయ సంస్థ ( FAO) ప్లాంట్ ప్రొటెక్షన్ విభాగానికి మాజీ అధిపతి, భారతదేశానికి మాజీ FAO రాయబారి. ఆయన ఆసియాలో ప్రసిద్ధి గాంచిన ‘రైతుల పొలం బడి కార్యక్రమ’ వ్యవస్థాపకులు. అయన పురుగు మందుల అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెన్ట్, రాటర్ డాం కన్వెన్షన్ కి, అత్యధిక ప్రమాదకరమైన పురుగుమందుల ప్రపంచ కార్యక్రమాన్ని సమన్వయం చేసే FAO-UNEP గ్లోబల్ ట్రీట్ కి ఎగజిక్యూటివ్ కార్యదర్శి, గా పనిచేశారు.
డాక్టర్ కేశవ్ క్రాంతి ప్రస్తుతం అమెరికాలోని అంతర్జాతీయ పత్తి సలహా కమిటీ లో సాంకేతిక సమాచార విభాగం ఆధిపతిగా పనిచేస్తున్నారు. అంతకు ముందు భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ICAR) నిర్వహించే నాగపూర్ లోని ప్రతిష్టాత్మక కేంద్ర పత్తి పరిశోధన సంస్థ (CICR) డైరెక్టర్ గా పనిచేశారు. అయన ప్రధానంగా ఇన్సెక్ట్ మాలిక్యులర్ బయాలజీ, టాక్సికాలజి, ఎకాలజి, ఇమ్యునాలజీ, బయోటెక్నాలజీ విభాగాలలో పరిశోధన చేశారు. డాక్టర్ క్రాంతి పత్తి పంటకు సంబంధించిన అనేక పుస్తకాలను రచించారు, అనేక బహుమతులను పొందారు, వాటిలో 2009 లో ICAC ఇచ్చిన ఇంటర్నేషనల్ కాటన్ రీసెర్చర్ అవార్డు కూడా ఒకటి.