రైతు సహకార సంఘాలు బల పడాలి-బహుళ జాతి సంస్థలు కాదు

కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక , ఫోన్: 9912928422
1942 ఆగష్టు 9.. భారత దేశం నుండి బ్రిటీష్ సామ్రాజ్యవాదులు వైదొలగాలని “క్విట్ ఇండియా “ ఉద్యమానికి ఆనాడు స్వాతంత్ర్యసమరయోధులు పిలుపు ఇచ్చారు. దేశమంతా ఈ నినాదంతో కదలి కదన రంగంలోకి దూకింది. 1947 ఆగష్టు 15 నాటికి దేశం నుండి బ్రిటీష్ పాలకులు వైదొలిగే వరకూ ఈ ఉద్యమాలు సాగాయి. నాటి ప్రజల లక్ష్యం ఒక్కటే . స్వయం పరిపాలన ,స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సుస్థిర అభివృద్ధి, దేశం అన్ని రంగాలలో స్వయం సమృద్ధి సాధించడం.
1991 నుండీ దేశంలో నూతన ఆర్ధిక విధానాలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయడం, అమ్మేయడం గత 30 ఏళ్లలో విపరీతంగా జరిగింది . ఈ విధానాల వల్ల బాగుపడిన వాళ్ళు కొందరైతే, మరింత పేదరికం లోకి జారిపోయిన వాళ్లు అత్యధికులు. మధ్యతరగతి ప్రజలకు కొన్ని అవకాశాలు దక్కాయి కానీ , పట్టణ పేదలు, గ్రామీణ వ్యవసాయ దారులు నిజమైన అభివృద్ధికి దూరంగా ఉండిపోయారు. ప్రభుత్వ రంగం నిర్వీర్యం అయిన కొద్ధీ, ప్రైవేట్ రంగం అన్ని రంగాలలో బలపడింది. ఉత్పత్తుల ,సేవల ధరలు పేదలకు అందకుండా పోతున్నాయి. ముఖ్యంగా విద్యా,వైద్య రంగాలలో ఈ పరిణామాన్ని మనం చూడవచ్చు.
గత 73 సంవత్సరాలుగా ప్రభుత్వ , ప్రైవేట్ రంగాల భాగస్వామ్యంతో దేశంలో మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ కొనసాగింది. మరీ ముఖ్యంగా మొదటి 43 సంవత్సరాలు ప్రభుత్వ రంగం ఉనికిలో ఉండడం వల్ల అనేక ఉత్పత్తులు, సేవలు ప్రజలకు చవక ధరలకు అందాయి. ప్రజల మౌలిక సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించకపోయినా వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వ రంగం తగినంత కృషి చేసింది.

ములకనూరు రైతు సహకార సంఘం నిర్వహిస్తున్న బియ్యం దుకాణం
ఈ ఆర్ధిక,పారిశ్రామిక విధానాలు గ్రామీణ ప్రాంతాన్ని మాత్రం మరింత సంక్షోభంలోకి నెట్టాయి. సన్న,చిన్నకారు,మధ్యతరగతి రైతులు ఆర్ధికంగా చితికిపోయారు. ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలు విస్తరించడమే కాదు, పంటల ఉత్పత్తి ఖర్చులూ భారీగా పెరిగిపోయాయి. యెరువులు,పురుగు మందులు, కలుపు మందుల వినియోగం బాగా పెరిగిపోయింది. గ్రామీణ కుటుంబాలు అర్ధాకలితో ,అనారోగ్యం తో , అప్పులతో కుంగిపోతున్నాయి. రైతు బలవన్మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది . గత 25 సంవత్సరాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో 50,000 మంది రైతులు,కౌలు రైతులు,వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతం నుండి వలసలు భారీగా పెరిగాయి . మెరుగైన జీవనోపాధికోసం కాకుండా, బతికి ఉండడం కోసం ఈ వలసలు సాగాయి. వ్యవసాయ కుటుంబాల ఆదాయాలు గణనీయంగా పడిపోవడమే ఈ వలసలకు ,ఆత్మహత్యలకు ప్రధాన కారణం.

గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించే సహజ వనరులు కూడా తగ్గిపోతున్నాయి. లేధా కాలుష్యం బారిన పడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి పోవడం, భూసారం తగ్గిపోవడం, అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం లాంటివి గ్రామీణ, ఆదివాసీ ప్రజలను మరింత సంక్షోభం లోకి నెడుతున్నాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం కేంద్ర,రాష్ట్ర పాలకుల విధానాలే. పట్టణాభివృద్ధి,పారిశ్రామిక,సేవా రంగాల అభివృద్ధి పేరుతో గ్రామాలను, గ్రామీణ ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ,నిధుల కేటాయింపు చేయకుండా, గ్రామీణాభివృద్ధిని , వ్యవసాయ కుటుంబాల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. ప్రభుత్వ రంగ వ్యవసాయ విస్తరణ వ్యవస్థను కుంటుపరిచి, పూర్తిగా వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్ కంపెనీల, దళారీల దోపిడీకి ఒదిలేశారు. విత్తనాలు,రసాయనాలు,యంత్రాలు,ఇతర మౌలిక వసతులు.,చివరికి పంట సాగు సలహాలు – అన్నిటి కోసం ప్రైవేట్ కంపెనీల మీద,వ్యాపారుల మీద ఆధారపడి బతకాల్సిన దుస్థితికి రైతులను నెట్టారు . రైతులను ఒంటరులను చేసి లాభాపేక్ష నిండిన కంపెనీల ఆకలికి బలి చేశారు.
నిజానికి 1960 దశకంలోనే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ ప్రాంతంలో ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు యేర్పడ్డాయి. ఒక 25 సంవత్సరాలు ఈ సంఘాలు రైతులను సంఘటితం చేశాయి. రైతులకు సేవ చేశాయి. పంట రుణాలు ఇవ్వడమే కాదు, వ్యవసాయ ఉపకరణాలు రైతులకు అందించాయి. గిడ్డంగులు నిర్వహించాయి. రేషన్ షాపులు నడిపాయి. తెలంగాణలో పొతంగల్, ఎత్తొండ లాంటి గ్రామాల రైతు సహకార సంఘాలు రైతుల సేవలో మంచి గుర్తింపు, అనేక అవార్డులు సాధించాయి. రెండు రాష్ట్రాలలో నిజాయితీ కలిగిన నాయకత్వం ఉన్న చోట ఈ సంఘాలు అద్భుత ఫలితాలు సాధించాయి.
ప్రభుత్వాల అనుచిత జోక్యం, రాజకీయ పార్టీల దివాళా కోరు వైఖరి ఈ సహకార సంఘాల ప్రాణం తోడేశాయి. తమ వాళ్ళు సహకార సంఘాల పాలక వర్గం గా ఉండాలనే ఆలోచనతో,ఈ సంఘాల ఎన్నికలను సాధారణ ఎన్నికల స్థితికి దిగజార్చేశారు. క్రమంగా రైతుల భాగస్వామ్యం సంఘాల నిర్వహణలో తగ్గిపోయింది. అవినీతికి పాల్పడే నాయకులు సంఘాలకు నాయకులుగా ఎన్నికవడం ప్రారంభమైంది. పంట రుణాలు ఇవ్వడంలో వాణిజ్య బ్యాంకుల పాత్ర పెరగడం తో ఈ సంఘాల ఉనికి నామమాత్రంగా మారిపోయింది. సహకార సంఘాల అభివృద్దికి ప్రభుత్వం కూడా ఏ మాత్రం తోడ్పాటు ఇవ్వలేదు.
1995 లో పరస్పర సహాయ సహకార సంఘాల చట్టం క్రింద రెండు తెలుగు రాష్ట్రాలలో వందలాది రైతు, మహిళా సహకార సంఘాలు ఏర్పడ్డాయి. మహిళా స్వయం సహాయక బృంధాల ఆధ్వర్యంలో ఏర్పడిన మహిళా సహకార సంఘాలు ఒక మేరకు నిలదొక్కుకున్నా పూర్తిగా పురుషులతో ఏర్పడిన రైతు సహకార సంఘాలు తమ ఉనికిని పెద్దగా నిలబెట్టుకోలేకపోయాయి. ములకనూరు లాంటి కొన్ని సహకార సంఘాలు బలంగా ఎదిగినా, ఈ చట్టం కింద ఏర్పడిన రైతు సహకార సంఘాలకు కూడా ప్రభుత్వం నుండి పెద్దగా సహాయం అందలేదు. పాల ఉత్పత్తి దారుల సహకార సంఘాలు, మత్స్యకారుల సహకార సంఘాలు కొంత విజయం సాధించాయి.
ఇటీవల కాలంలో NABARD,SERP,ఉద్యాన శాఖలు రెండు తెలుగు రాష్ట్రాలలో రైతు ఉత్పత్తి దారుల సంఘాల ఏర్పాటును ప్రోత్సహిస్తునాయి. 1956 కంపెనీ చట్టంలో 2013 లో తెచ్చిన సవరణతోనూ, మరియు MACS చట్టం ప్రకారం ఈ సంఘాలు ఏర్పడుతున్నాయి.కేంద్ర ప్రభుత్వ ప్రాధమిక సహకారంతో ఏర్పడుతున్న ఈ సంఘాలకు రిజిస్ట్రేషన్,నిర్వహణ,సామర్ధ్యం పెంపు కోసం NABARD నుండి సహకారం అందుతున్నది.
కానీ ఇప్పటికీ ఈ సంఘాలతో ఎలా వ్యవహరించాలో,ఎలాంటి సహకారం అందించాలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధిష్టంగా నిర్ణయించలేదు. ఇప్పటికే రెండు తెలుగు రాస్త్రాలలో మూడు వేలకు పైగా ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు,ఇరవై వేలకు పైగా రైతు, మహిళా పరస్పర సహాయ సహకార సంఘాలు,ఎనిమిది వందలకు పైగా రైతు ఉత్పత్తిదారుల కంపనీలు ఏర్పడ్డాయి. వంద మంది నుండి అయిదు వేల మంది వరకు ఈ సంఘాలలో రైతులు సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వాల వ్యవసాయ రంగ పధకాల నుండి, ఇతర సంస్థల సహకారం తోనూ ఈ సంఘాలు కొన్ని మౌలిక సౌకర్యాలను కూడా సమకూర్చుకున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రామీణ రైతులను,ఇతర ఉత్పత్తి దారులను ఈ సహకార సంఘాలు, కంపనీలలోకి సమీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను రూపొందించగలితే,ఈ సహకార సంఘాలను,కంపెనీలను ప్రోత్సహిస్తున్న వివిద సంస్థల మధ్య సమన్వయాన్ని సాధించగలిగితే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. గ్రామీణ ప్రాంతంలో,వ్యవసాయ యంత్రాలతో కూడిన కస్టమ్ హైరింగ్ సెంటర్లు,గిడ్డంగులు,శీతల గిడ్డంగులు ఈ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చెయ్యడానికి ప్రభుత్వం పెట్టుబడి పెట్టగలిగితే, ప్రభుత్వం పంటలను ఈ సంఘాల ఆధ్వర్యం లో సేకరించగలిగితే రైతుల ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయి.

రైతుల సమస్యలను పరిష్కరించడానికి సహకార సంఘాలను మరింత ప్రోత్సహించాల్సిన కేంద్ర ప్రభుత్వం, వాటి ప్రాధమిక ఉనికికే ప్రమాదం తెస్తూ , భారత వ్యవసాయ రంగాన్ని మరింతగా కార్పొరేట్ కంపనీల కబంధ హస్తాల్లోకి నెట్టివెయ్యడానికి ఇటీవల మూడు ఆర్డినెన్సులను విడుదల చేసింది. ఈ ఆర్డినెన్సులు అమలు లోకి వస్తే భారత రైతులు మరింత నష్టపోతారు. వారి పంటలకు మద్దతు ధరలు అందవు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రక్రియపై కంపనీల పెత్తనం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా విదేశీ ,స్వదేశీ బహుళ జాతి సంస్థలు వ్యవసాయ రంగం పై పట్టు బిగిస్తాయి. ఫలితంగా దేశ ఆహార భద్రత,ఆర్ధిక భధ్రత ప్రమాదంలో పడుతుంది. ప్రజలు బానిసత్వంలోకి వెళ్లిపోతారు. సహజ వనరులు ఈ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతాయి.
కేంద్రం తెచ్చిన మూడు ఆర్డినెన్సులను వ్యతిరేకిస్తూనే, కార్పొరేట్లకు ప్రత్యామ్నాయంగా రైతు సహకార సంఘాలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలీ . వ్యవసాయ కుటుంబాల ఆదాయ భద్రత కోసం నిజమైన ప్రత్యామ్నాయం యిదొక్కటే.